అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు.
ఆ ఊళ్ళో ఒక గుడి వుండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు.
అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది.
ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి, తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు.
అందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు- “వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి, ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా వుంది. మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి!”
ఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు. ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.
కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.
ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. “మీరు ఇంకా ఇక్కడే వున్నారా! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం, నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి!” అన్నారు.
కాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.
చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి. పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంత సేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటంలేదు, చలి గా వుంది, నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు.
“దేవుడా! నేను నీకు ఏమి తక్కువ చేసాను? రోజు శ్రద్ధగా పూజలు చేసాను. నిన్నే నమ్ముకున్నాను! అయినా నన్ను కాపాడడానికి రావేంటి!” అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు.
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “మూర్ఖుడా! నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు. నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా?” అని మందలించి మాయమయిపోయాడు.
పూజారికి వెంటనే గ్యానోదయం అయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి, క్షమాపణ కోరాడు.
కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు. “పూజారి గారు! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ వుండడం మంచిది కాదు!” అన్నారు.
పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.